Wednesday 18 December 2019

ప్రశ్నార్థకం కానున్న పౌరసత్వం Citizenship amendment bill under dialoma

కేంద్రం లోని బి.జె.పి ప్రభుత్వం 'పౌరసత్వ చట్టం-1955'కు సవరణలు చేసింది. అదేవిధంగా ఇటీవల అసోంలో అమలు జరిపిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సి)ను దేశ వ్యాప్తంగా అమలు జరపబోతున్నది. వీటికి వ్యతిరేకంగా నిరసనలు పెల్లుబుకుతున్నాయి. వీటి పట్ల ప్రజలలో ఇంత ఆగ్రహావేశాలు ఎందుకు పెల్లుబుకుతున్నాయి? వీటిలో ఏముంది?

పౌరసత్వ చట్ట సవరణ ఏంటి?
'భారత పౌరసత్వ చట్టం' 1955లో వచ్చింది. ఈ చట్టం ప్రకారం భారత దేశంలో ఉన్న పౌరులందరూ భారత పౌరులే. దేశ విభజన సమయంలో పాకిస్తాన్‌ నుండి, తూర్పు పాకిస్తాన్‌ (నేటి బంగ్లాదేశ్‌) నుండి, ఆప్ఘనిస్తాన్‌ నుండి మన దేశంలోకి వలస వచ్చిన వారికి ఏ ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వాలో ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇందులో కుల, మత, లింగ బేధాలు లేవు. ఇదే నేటి వరకు అమలు జరుగుతున్నది. ఇప్పుడు బి.జె.పి ప్రభుత్వం ఈ చట్టానికి సవరణ చేసింది. దీని ప్రకారం పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌, ఆప్ఘనిస్తాన్‌ దేశాలలో మత వివక్షతకు గురై భారత్‌ లోకి వచ్చిన హిందువులకు, క్రైస్తవులకు, సిక్కులకు, జైనులకు, బౌద్ధులకు మాత్రమే భారత్‌లో పౌరసత్వం ఇస్తారు. మత పరంగా చూసినప్పుడు ఇందులో ముస్లింలను లేకుండా చేశారు. పోనీ అలాగని హిందూ దేశాలన్నింటినీ కలిపారా అంటే అదీ లేదు. ఉదాహరణకు శ్రీలంకలో తమిళులు తాము సింహళ జాతీయుల చేతులలో వివక్షకు గురవుతున్నామని పోరాడుతున్నారు. శ్రీలంకను అతలాకుతలం చేసిన సమస్య ఇది. ఇప్పటికీ పూర్తి పరిష్కారం కాలేదు. నాటి నుండి నేటికీ అనేక మంది తమిళులు భారత్‌కు పారిపోయి వస్తున్నారు. వారిలో అత్యధికులు హిందువులే. కాని ఈ సవరణలలో శ్రీలంకను కలపలేదు. భూటాన్‌లో క్రైస్తవులు వివక్షకు గురవుతున్నారు. అయినా భూటాన్‌ను కలపలేదు. ఇవన్నీ చూసినప్పుడు ఇది ముస్లింలను లక్ష్యంగా చేసిన సవరణనేనన్నది స్పష్టమవుతోంది.
మతం ఆధారంగా పౌరసత్వాన్ని గుర్తించడం ప్రపంచంలో ఎక్కడా లేదు. చివరకు మత రాజ్యాలుగా ఉన్న గల్ఫ్‌ దేశాలకు ఇతర దేశాల నుండి ముస్లింలు వెళ్ళినా, వాటికన్‌ సిటీకి ఇతర దేశాల నుండి కాథలిక్‌ క్రైస్తవులు వెళ్ళినా పౌరసత్వం ఇవ్వరు. అలాగే ప్రపంచంలో ఒకే మతానికి చెందిన వారైనప్పటికీ ఇతర దేశాల నుండి వచ్చే వారికి పౌరసత్వం ఇవ్వరు. ఏ దేశంలో అయినా పౌరసత్వ చట్టాలు...మతంతో ముడి పెట్టకుండా అందరికీ ఒకే రకంగా ఉంటాయి. మతం విశ్వాసానికి సంబంధించింది. పౌరసత్వం దేశ రాజ్యాంగానికి సంబంధించింది. వ్యక్తి విశ్వాసాన్ని మార్చుకోవచ్చు. కాని రాజ్యాంగం దేశ పౌరులందరికీ ఒకటే. దానిలో ఏ మార్పు వచ్చినా అది ఆ దేశ ప్రజలందరికీ వర్తించేలా మార్పు చేయాల్సిందే.
ఇతర దేశాల నుండి కాందిశీకులుగా వచ్చిన వారికి మన దేశంలో పౌరసత్వం ఇవ్వాలా వద్దా? ఇవ్వాలనుకుంటే కాందిశీకులుగా వచ్చిన వారందరికీ ఇవ్వాలి. లేకపోతే పౌరసత్వం లేకుండా అలా బతకనివ్వవచ్చు. లేదా వారి మాతృ దేశాలకు తిప్పి పంపివేయవచ్చు. అంతేగాని మతపరంగా పౌరసత్వం ఇవ్వడమేంటి? ఇది రాజ్యాంగ విరుద్ధం. అందుకే దేశం లోని వివిధ పార్టీలు, రాష్ట్రాలు దీన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలలో వీధి పోరాటాలు జరుగుతున్నాయి. అసోం లోకి కాందిశీకులుగా వచ్చిన హిందూ, ముస్లిం, క్రైస్తవులు, సిక్కు, జైన, బౌద్ధులతో సహా కాందిశీకులందరినీ మత ప్రసక్తి లేకుండా వెనుక్కు పంపేయమని అసోం ప్రజలు పోరాడుతున్నారు. పోరాటాల్లో పాల్గొన్న వారిపై పోలీసులు కాల్పులు జరుపుతున్నారు. ఇంత వివక్షతో కూడినది కనుకనే ఐక్యరాజ్య సమితి తీవ్రంగా వ్యతిరేకించింది. ఈ సవరణకు వ్యతిరేకంగా భారత్‌లో జరగుతున్న ఆందోళనలను గమనించిన అమెరికా, కెనడా, సింగపూర్‌, బ్రిటన్‌, ఫ్రాన్స్‌ దేశాలు పర్యాటకులను భారత్‌కు పంపరాదని తమ దేశ పర్యాటక సంస్థలను ఆదేశించాయి. మన దేశాన్ని ఒక భయానక దేశంగా చూస్తున్నాయి.

జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌
ఈ పౌరసత్వ చట్ట సవరణ వలన మన రాష్ట్రంలో మనకేంటి నష్టం? అసోంలో కేంద్ర ప్రభుత్వం జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ను ఎన్నికలకు ముందే అమలు జరిపింది. ఇప్పుడు దేశ వ్యాపితంగా ప్రవేశ పెట్టబోతున్నారు. అంటే మనలో ప్రతి ఒక్కరూ 24 మార్చి 1971కు ముందు నుండి ఈ దేశంలో ఉంటున్నామని నిరూపించుకోవాలి. అంటే 48 ఏళ్ళ క్రితం నాటి ఆధారాలు సమర్పించాలి. అప్పుడే మన పేరును ఆ రిజిస్టర్‌లో నమోదు చేస్తారు. లేకపోతే మనం ఈ దేశ పౌరులుగా గుర్తించబడం. గుర్తింపు పొందటానికి ఇప్పుడున్న ఆధార్‌, పాన్‌ కార్డులు డ్రైవింగ్‌ లైసెన్సుల లాంటివి సరిపోవు. ఇవన్నీ మనకు లాగనే అసోం ప్రజల వద్దా ఉన్నాయి. అయినా అసోంలో 19 లక్షల మందికి ఈ రిజిస్టర్‌లో చోటు దక్కలేదు. వారిలో అత్యధికులు ఈ దేశంలో పుట్టి పెరిగిన వారే. వీరిలో సగం మంది హిందువులు కూడా ఉన్నారు. కారణం 48 ఏళ్ళ క్రితానికి చెందిన సరైన ఆధారం చూపలేక పోయారు. రేపు మన పరిస్థితి కూడా అంతే. అత్యధికులు ఆధారాలు చూపలేరు. కారణం 1971కు ముందు జనన ధ్రువీకరణ పత్రాలు లేవు. ఆనాడు ఉన్న ఓటరు జాబితాలో తన పేరు గాని తన తల్లిదండ్రుల పేరు గాని ఉంటే ఉన్నట్లు, లేకపోతే లేదు. అసలా ఓటరు జాబితా దొరకటమే కష్టం. ఆనాడు ఆస్తిపాస్తులను కలిగి ఉన్నట్లుగా పన్ను రశీదులు లాంటివి ఏమైనా చూపాలి. అందరి దగ్గరా అవి ఉండక పోవచ్చు. ఆస్తులు లేని వారైతే అసలు చూపించే అవకాశమే లేదు. లేదా 1971 ముందు ఇచ్చిన రేషన్‌ కార్డు ఉంటే అది చూపవచ్చు. అవి ఎంత మంది వద్ద ఉంటాయి? 1971కు ముందు గానీ తర్వాత గానీ చాలా మంది పనుల కోసం, ఉద్యోగాల కోసం పట్టణాలకు వలస వచ్చారు. వారి దగ్గర ఆనాటి ఆధారాలు ఉండే అవకాశాలు చాలా తక్కువ. సీజనల్‌గా వలస పోయే వ్యవసాయ కూలీలకు, అటవీ ప్రాంతాలలో నివసించే గిరిజనులు, పనులు, ఉద్యోగాలు వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్లిన కార్మికులు, ఉద్యోగులు ఘోరంగా దెబ్బతింటారు. ఈ ఆధారాల కోసం మనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసి వస్తుంది. ఈ లంచగొండి సమాజంలో డిమాండును బట్టి లంచాలుంటాయి. ఆ రిజిస్టర్‌లో మన పేరు నమోదు చేసుకునే వరకు మన పాస్‌పోర్టులు, రేషన్‌ కార్డులు, ఓటు హక్కు ఉండవు. కొన్ని సందర్భాలలో ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉంది. ఈ పాలకులు తమకు కావాలనుకున్న వాళ్ళవి రిజిస్టర్‌లో నమోదు చేయిస్తారు. లేకుంటే మన గతి అంతే అవుతుంది. అసోంలో భారత 5వ రాష్ట్రపతి ఫక్రుద్దీన్‌ ఆలీ అహమ్మద్‌ కుటుంబ సభ్యులకు ఈ రిజిస్టర్‌లో చోటు దక్కలేదు. 30 సంవత్సరాల పాటు భారత ఆర్మీలో లెఫ్టినెంట్‌ అధికారిగా పని చేసి, కార్గిల్‌ యుద్ధంలో పాల్గొని, రిటైరైన వ్యక్తిని 'నీ దగ్గర సరైన ఆధారాలు లేవు. నీవు భారతీయ పౌరుడవు కావు' అని చెప్పారు. అనేక మంది రిటైరైన బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులను రిజిష్టర్‌లో నమోదు చేయకుండా పౌరసత్వం నిరాకరించారు. కారణం 48 ఏళ్ళ కిందటి ఆధారాలు చూపలేక పోవటమే. అంతటి ఉన్నత స్థానాలలో, దేశానికి సేవ చేసిన వారే ఆధారాలు చూపించలేక పోతే సామాన్యులు చూపగలరా? వీటిని బట్టి చూస్తే ఈ రిజిస్టర్‌ ప్రభావం మన మీద ఎలాంటి దుష్పరిణామాలు చూపబోతుందో అర్థం చేసుకోవచ్చు. అయినా ఈ దేశంలో పుట్టి పెరిగిన మనం, తరతరాలుగా ఈ గడ్డ మీదనే జీవిస్తున్న మనం, 72 ఏళ్ళ స్వాతంత్య్రం తరువాత ఈ దేశ పౌరులమేనని నిరూపించుకోవట మేంటి? ఆధారాల కోసం ఆఫీసుల చుట్టూ తిరగటమేంటి? రిజిస్టర్‌లో పేరు నమోదవ్వలేదని ఏడుస్తూ కూర్చోవడమేంటి? అసోంలో జరుగుతుంది ఇదే. రేపు మనకు జరగబోతున్నదిదే.
ఇప్పటికే దీనివల్ల అసోం ప్రజలు వీధుల్లోకి వచ్చి వ్యతిరేకతను తెలియచేస్తున్నారు. ఎన్‌ఆర్‌సి ని దేశం మొత్తం అమలు జరిపితే, యావత్‌ దేశం ఆందోళనలతో, పోరాటాలతో అట్టుడికిపోతుంది. ఈ ఆందోళనలో మనం, మన బిడ్డలు నలిగి పోవటం అవసరమా? ఇది గమనించే కేరళ, పంజాబ్‌, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఈ పౌరసత్వ చట్ట సవరణను తమ రాష్ట్రాలలో అమలు జరపబోమని ప్రకటించారు. అయితే రాష్ట్రాలకు ఆపే హక్కు లేదని అమిత్‌ షా అంటున్నారు. మన రాష్ట్రంలో అధికారంలో ఉన్న వై.ఎస్‌.ఆర్‌ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీల సభ్యులు పార్లమెంటులో ఈ చట్ట సవరణకు అనుకూలంగా ఓటేశారు. ఒకాయనకు కేసుల భయం. ఇంకొకాయనకు మరల బి.జె.పితో సయోధ్య కుదుర్చుకోవాలన్న ఆరాటం. వీరికి సొంత ప్రయోజనాలే ముఖ్యం. అంతే తప్ప రాష్ట్ర, దేశ ప్రజల ప్రయోజనాలు, దేశ సమైక్యత ముఖ్యం కాదు. కొంతమంది ఇదేదో ముస్లింల గోల అని, మరి కొంతమంది ఇంకా కాస్త ముందుకు వెళ్ళి ముస్లింలను బుజ్జగించటానికి రాజకీయ పార్టీలు చేస్తున్న గోల అని, మరి కొంతమంది ఇది మన రాష్ట్రంలో లేదుగా మనకెందుకు అని ప్రచారం చేస్తున్నారు. ఇది సమస్యను పక్క దారి పట్టించి, బి.జె.పి చేస్తున్న దుర్మార్గాలకు ప్రతిఘటన లేకుండా చేయటం కోసం చేస్తున్న దుష్ప్రచారం. నిజానికి ఇది ముస్లింల గొడవ మాత్రమే కాదు. దేశ ప్రజలందరి గొడవ. ఎన్‌ఆర్‌సి అమలు జరిగితే దేశ ప్రజలందరికీ ప్రమాదం. ముఖ్యంగా ఉద్యోగులు, కార్మికులకు తీవ్ర ప్రమాదం. దేశ సమైక్యతకే ప్రమాదం. అందుకే వామపక్షాలు ఈ చట్టసవరణ, జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని నిర్ణయించాయి. దుర్మార్గమైన ఈ రెంటినీ వెనక్కు తీసుకునే వరకు పోరాడటం ప్రతి భారతీయుడి కర్తవ్యం.

No comments:

Post a Comment